Thursday 31 December 2020

The story of Gregorian Calendar in Telugu

మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. ఆ కేలెండెర్ ఎలా సృష్టించబడిందీ, ఎవరు, ఎలా, ఏ కాలంలో రూపకల్పన చేశారూ, నేటి కేలెండెర్ రూపానికి అది చేరుకోడానికి ఎన్ని మార్పులు చెందిందీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎన్నో మార్పులూ, చేర్పులూ, ఎన్నెన్నో వింతలూ, విశేషాలతో ఏర్పడ్డ విశేషమే మనం వాడుతున్న ప్రస్తుత కేలెండెర్. ఆ రూపకల్పన పాతబడని విశేషమే కదా మనకి. కొత్త సంవత్సరం కొత్త కేలెండెర్ని ఎప్పుడుప్పుడు చూద్దామా అని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే మీకు అసలా కేలెండెర్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని అంతే ఉత్సాహంగా ఉంది కదూ? ఐతే వెంటనే ఆ కేలెండెర్ కథలోకి వెళ్ళిపోదాం.


అతి ప్రాచీనకాలం నుంచీ రాత్రీ పగలూ, రాత్రీ పగలూ ఒక దాని వెనుక ఒకటి వస్తూండడం గమనిస్తూ వచ్చాడు మానవుడు. కాలగణనానికి అదొక అనువైన ప్రమాణంగా తోచింది. ఈనాటి సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకూ ఒక పగలూ, ఒక రాత్రీ కలిపి ఒక రోజుగా భావించి లెక్కలు కట్టడం ప్రారంభించాడు.

ఆ నాటి సగటు మానవ జీవితం 30 సంవత్సరాలే అనుకున్నా, రోజుల్లో లెక్కడితే 11 వేల రోజుల పైనే అనుకున్నా అయ్యేది. ఇన్ని రోజులు ఒకదాని తరువాత ఒకటి లేక్కపెట్టడంలో ఏన్నో తప్పులు వచ్చేవి. రోజు కంటే పెద్ద కాల ప్రమాణం అవసరం పెరిగింది. చందమామ అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వృద్ది చెందటం, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా క్షీణిస్తూ ఉండటం గమనించిన మానవుడికి ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న కాలం మరొక ప్రమాణంగా ఏర్పడింది.ఇది సుమారు ఇరవై తొమ్మిదిన్నర రోజులు. దీన్ని 'నెల ' అంటారు.మానవ జీవిత ప్రమాణం తెలియడానికి 11 వేల రోజులు లెక్కపెట్టనక్కర లేదు.360 నెలలు లెక్కిస్తే చాలు. మానవుడు జంతువులను వేటాడుతూనో, పశువుల్ని మేవుకుంటూనో, దేశ ద్రిమ్మరిగా తిరిగే రోజుల్లో మాసానికి విశేష ప్రాముఖ్యం లేకపోయింది. అయితే వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచీ స్థిర జీవితానికి అలవాటు పడ్డాడు. వ్యవసాయం మీద ఋతువుల ప్రభావం ఎంతో ఉంది, సరైన ఋతువులో గింజలు చల్లాలి. వర్షాలు పడే రోజు చుసుకొని పంటలు వేయ్యాలి. లేకపోతే అంతా నాశనమే! ఈ కారణం చేత ఎండాకాలం ఎప్పుడొస్తుందో, తొలకరి ఎప్పుడు ప్రారంభమవుతుందో, శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరంగా తెలియాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఋతువు ప్రారంభంలో గింజలు చల్లితే, ఆ సంవత్సరం పంటలు బాగా పండితే, 12 నెలల తర్వాత మళ్లీ అదే ఋతువు ప్రారంభంలో మళ్ళీ గింజలు చల్లవచ్చని రైతు దైర్యంగా ఉంటాడు.

 12 చంద్ర మాసాలు 354 రోజులకు సమానం.కాని, ఇవి రుతుచక్రంతో సమానంగా నడవ్వు. ఈ రోజు వసంత ఋతువు ప్రారంభమనుకోండి. 12 చంద్ర మాసాల తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం తిరిగి వసంత ఋతువుతో ప్రారంభమైతే ఏ ఇబ్బంది. ఉండేది కాదు. నెలకొక్కొక్క రాశి చొప్పున సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశులూ తిరిగి మళ్లీ తన ప్రస్థానం ప్రారంభిస్తాడు. రుతు చక్రం కూడా సూర్య గమనంతో సరిగ్గా తిరుగుతుంది. చంద్ర గమనంతో కాదు. సూర్యుడు 12 నక్షత్ర రాశుల్నీ సరిగ్గా 365.25 రోజుల్లో చుట్టి వస్తాడు. దీన్ని సౌర సంవత్సరం అంటారు.xxx ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే ఈజిప్టు దేశస్థులకు చంద్ర కళల మీద కంటే, రుతుచక్రం మీదనే ఆసక్తి ఎక్కువ. ఆ దేశస్థుల జీవనాధారం నైలు నది. నైలు నది వరదలతో వారి ఎడారి భూముల సస్యశ్యామలాలయ్యాయి. ఈవరదలు 365 రోజులకొక సారి వచ్చేవి. వారు సవత్సర కాలాన్ని ఆధారంగా తీసుకొని కేలండరు తయారు చేసుకున్నారు. దీన్ని 12 నెలలుగా విభజించారు. నెలకి 30 రోజుల చొప్పున 360 రోజులు పోగా, మిగిలిన 5 రోజులూ పండుగ రోజులూగా భావించి, ఆ తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం లెక్కకట్టేవారు. సూర్యుడి గతి మీద ఆధారపడ్డ సౌర సంవత్సరం 365.25 రోజులు కావడంతో నైలు నది వరదలు సంవత్సర ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా అలస్యంగా వస్తూ వచ్చాయి.

గ్రీకు విజ్ఞాని యూడోక్సస్ క్రీ.పూ. 380 ప్రాంతంలో సంవత్సరం పొడవులోని ఈ ఆరు గంటల వ్యత్యాసాన్ని కనుగొన్నాడు. ఈజిప్టుని పాలిస్తున్న మాసిదోనియా రాజు టోలెమీ ఈ తేడాని గుర్తులో ఉంచుకొని కేలండరులో మార్పులు తేవాలని ప్రయత్నించాడు.కాని చాందస ఈజిప్షియన్ పురోహితులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. రోమన్లు సౌర, చాంద్రమాన పద్థతులను కలిపి ఒక కేలండరు ఏర్పాటు చేసుకున్నారు . మొదట్లో వారి సవత్సరానికి పది నెలలే ఉండేవి. మొదటి నాలుగు నెలలూ, వారి దేవుళ్ళ పేరిట; మర్షియస్, ఏప్రిలిస్, మెయస్, జూనియస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మాసాలకు సంఖ్యానామాలిచ్చారు. అవి, క్వింటిలిస్ (ఐదవది), సెక్సటిలిస్ (ఆరవది), సెప్టెంబర్ ?(ఏడవది), అక్టోబర్ (ఎనిమిదవది), నవంబర్ (తొమ్మిదవది), డిశంబర్(పదవది). వారి సంవత్సరం మార్చిన ప్రారంభం అయ్యేది. రోమన్ రిపబ్లిక్*కి ఏడాదికొకసారి ఎన్నికలు జరిగేవి. రోమను పురోహితులు తమకు అనుకూలమైనవారు పదవిలో ఉంటే సంవత్సరానికో అధికమాసం తగిలించేవారు. వ్యతిరేకులు పదవిలో ఉంటే మానేసేవారు. ఈ విధంగా వారి కేలండరు అస్తవ్యస్తంగా తయారయ్యేద. క్రీస్తుపూర్వం 46వ సంవత్సరం నాటికి సూర్యుడు గతికీ, వారి కేలండరుకీ 80 రోజుల దాకా వ్యత్యాసం ఏర్పడింది.

అప్పుడే ఈజిప్టునించి తిరిగి వచ్చిన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజరు ఈ గందరగోళమంతా చూసి, కేలండరు సంస్కరణకి పూనుకున్నడు. సౌర సంవత్సరం పొడవు 365.25 రోజులుగా గుర్తించాడు. అప్పటి దాకా ఉన్న పది నెలలకీ జనవరి, ఫిబ్రవరి అనే మరో రెండు మాసాలను చేర్చాడు.

మార్చి 1వ తేదీ బదులు, జనవరి 1వ తేదీని సంవత్సరం ప్రారంభం కావాలన్నాడు. నెలకీ 30 రోజుల చొప్పున 12 నెలలకీ 360 రోజులు. పోగా మిగిలిన 5 రోజులూ వీటిలో 5 నెలలకు సర్దాడు.ఈ లెక్కన 5 నెలలకు 31 రోజులు, 7 నెలలకు 30 రోజులూ ఉండాలి. కాని రోమన్లకు ఫిబ్రవరి అచ్చిరాని మాసం. అందుచేత దానిలో ఒక రోజు తీసి మరో నెలకు చేర్చాడు. ఈ విధంగా ఆరు మాసాలు 31 రోజులతోటీ, 5 మాసాలు 30 రోజులతోటీ, ఒక మాసం 29 రోజులతోటీ ఏర్పడ్డాయి. జనవరి 31, ఫిబ్రవరి 29 ,మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, క్వింటిలిస్ 31, సెక్సిటిలిస్ 30, సెప్టెంబరు 30, అక్టోబరు 31, నవంబర్ 30, డిసెంబర్ 31 రోజులతో,మొత్తం 365 రోజులూ పూర్తి అయ్యాయి. అయితే, సంవత్సరానికి పావు రోజు చొప్పున 4 సంవత్సరాలలో ఒక రోజు మిగిలిపోతుంది. అందుచేత ప్రతి నాలుగో సవత్సరానికీ 365 రోజుల బదులు 366 రోజులు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును ఫిబ్రవరి మాసానికి కలిపి ఫిబ్రవరిలో 29 రోజులకి బదులు 30 రోజులు ఉండాలని నిర్ణయమైంది.

సంవత్సరానికి 365 రోజులుంటే 52 వారాల ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరి 10 వ తేదీ ఈ సంవత్సరం ఆదివారమైతే, మరుసటి సంవత్సరం అది సోమవారమూ, ఆ తరువాత సంవత్సరం మంగళవారం అవుతూ వస్తుంది. 366 రోజులుంటే 52 వారాల 2 రోజులు, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారమయి, ఇది 366 రోజుల సంవత్సరమయితే పై సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారమవుతుంది. ఒక రోజు దాటేసి, గెంతేసి, లీప్ చేసి అయిందన్న మాట. అందుచేత అటువంటి సంవత్సరాన్ని 'లీప్ ఇయర్ ' అంటారు. ఈవిధంగా 4 సంవత్సరాలకు ఒక సారి 'లీప్ ఇయర్ ' వస్తుంది.xxx ఇంత కష్టపడ్డందుకు ప్రతిఫలంగా తన పేరు అచంద్రార్కం నిలిచిపోయేందుకు 'క్వింట్*లిస్ ' మాసాన్ని తన పేరిట జులై మాసంగా మార్చేశాడు జూలియస్ సీజర్. ఈ కేలెండరు అమలులోకి వచ్చే ముందు క్రీ.పూ. 46వ సంవత్సరానికి 445 రోజులు ఏర్పాటు చేసి, ఆ తర్వాత నుంచే కొత్త కేలెండర్ని అమలులోకి తెచ్చేడు. ఈ విధంగా దారి తప్పిపోయిన రోమను కేలండర్ని క్రమబద్ధం చేశాడు జూలియస్ సీజర్. అప్పటి నుంచి ఈ కేలండర్ని ' జూలియస్ కేలండర్ ' అని పలిస్తూ వచ్చాడు.

జూలియస్ సీజరు తరువాత సీజర్ అగస్టస్ పరిపాలనకు వచ్చాడు.' జూలియస్ సీజర్ సంవత్సరంలోని ఒక మాసానికి తన పేరు పెట్టుకోగా లేనిది నేనెందుకు పెట్టుకోకూడదు? 'అనుకున్నాడు. సెక్స్*టిలియస్ మాసానికి తన పేర ' ఆగస్టు ' అని పేరు పెట్టాడు. ' వీధుల పేర్లూ, నగరాల పేర్లూ తమకనుకూలంగా మాచ్చేసే పద్థతి ఈ నాటిదికాదు. రెండు వేల సంవత్సరాల పూర్వం నించీ ఉంది. పేరైతే మార్చాడు ఆగస్టస్ చక్రవర్తి. కాని జులై మాసానికి 31 రోజులుంటే ఆగస్టుకు 30 రోజులే వచ్చాయి. దాంతో తల కొట్టేసినట్లయ్యింది అతనికి. ఇది పని కాదని, ఫిబ్రవరి మాసంలోని 29 రోజులలో ఒక రోజు తీసివేసి ఆగస్టుకు కలిపేసి దానికి 31 రోజులు చేశాడు. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కాదవా ? ఈ విధంగా ఫిబ్రవరి నెలకు 28 రోజులే మిగిలాయి, అప్పటినుంచి లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి.

నికేయా నగంలో జరిగిన క్రైస్తవ చర్చి కౌన్సిల్ జూలియన్ కేలండర్ని ఆమోదించింది. xxx సౌర సంవత్సరం 365 1/4 రోజులయితే ఈ కేలండరు ఏ అవాంతరమూ లేకుండా సాగిపోయేది. కథ కంచికి వెళ్ళేది. కాని సౌర సంవత్సరం పొడవు సరీగా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు. లేదా 365,24220 సవత్సరాలు ఈ లెక్కని సౌర సంవత్సరం కంటె జూలియన్ సంవత్సరం సగటున 11 నిముషాల 14 సెకన్లు పెద్దది. ఈ తేడా స్వల్పమే అయినా కొన్ని శతాబ్దాలు గడిచేటప్పటికి పెద్దదౌతుంది. 128 సంవత్సరాలలో సౌర సంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం ఒక రోజు పెద్దదవుతుంది. సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖని దాటి ఉత్తరాభిముఖంగా కదిలే రోజును వసంత విషువత్ ( స్ప్రింగ్ ఈక్వినాక్స్ ) ఆంటారు. ఆ రోజున రాత్రింబగళ్ళు సరిగ్గా పన్నెండేసి గంటలు. క్రీ.శ. 325 లో అది మార్చి 21న వచ్చింది. 453లో మార్చి 20న, 581లో మార్చి 19కి జరిగిపోతూ వచ్చింది. ఈ వసంత విషువత్తు క్రీ.శ. 1263 నాటికి సౌరసంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం 8 రోజులు పెద్దదయింది. ఆ సవత్సరం వసంత విషువత్తు మార్చి పదమూడవ తేదీనే వచ్చింది. క్రైస్తవుల ఈస్టర్ పండుగ ఈ వసంత విషువత్*తో ముడిపడి ఉంది. ఇది ఈ విధంగా జరిగిపోతూ ఉండటంతో ఈస్టర్ పండుగ జరిగిపోతూ వచ్చింది. రోజర్ బేకన్ ఈ సంగతులన్నీ వివరిస్తూ పోపు నాలుగవ అర్బన్*కి 1263లో ఒక ఉత్తరం రాశాడు. కాని, మరో మూడు శాతాబ్దాల దాకా క్రైస్తవ మతాధికారులు ఏ చర్యా తీసుకోలేదు. 1582 నాటికి వసంత విషువత్ మరో రెండు రోజులు ముందుకు జరిగింది. అ ఏడు మార్చి 11 నే వచ్చింది. అప్పుడు పోవు అయిన గ్రిగరీ - పదమూడు, ఇక ఊరుకుంటే లాభం లేదని రంగంలోకి దిగాడు. మొట్టమొదటగా ఆ సంవత్సరం అక్టోబర్*లో 10 రోజులు తీసేశాడు. అక్టోబరు 5ని అక్టోబరు 15గా మార్చేఏడూ.
దానితో జూలియన్ కేలండర్ సౌర సంవత్సరంతో సమానమయింది. 1583లో వసంత విషవత్తు మళ్ళీ మార్చి 21కి వచ్చేసింది. కాని ఇలాగే ఊరుకుంటే అది మళ్ళీ వెనక్కి జారడం ప్రారంభిస్తుంది. ఈ తేడా 128 సంవత్సరాలకు ఒక రోజు అని చెప్పుకున్నాం. అయితే 384 సంవత్సరాలలో 3 రోజులు, లేదా 4 శతాబ్ధాలకు 3 రోజులు అవుతుంది. ప్రతి నాల్గు వందల సంవత్సరాల్లోను 3 లీపు సంవత్సరాలు వదిలివేస్తే సరి. తూర్పు యూరప్ దేశాలు, రష్యాలోని ఆర్ధడాక్స్ చర్చ్ అప్పటికీ దీన్ని అంగీకరించలేదు. 1917 రష్యన్ బోల్ష్విక్ విప్లవం తర్వాత లెనిన్ గ్రెగోరియన్ కేలెండర్ని అమలుపరిచాడు. అక్టోబర్ 25ని నవంబర్ 7గా మార్చాడు. ఇదీ జూలియన్, గ్రెగోరియన్ కేలెండెర్ కథ.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only