Friday 4 June 2021

Stories for kids in telugu

Moral Stories in Telugu series
కొన్ని కొన్ని కథలు కేవలం వినోదానికి మాత్రమే కాదు వాటి నుండి ఎన్నో జీవన విలువలు నేర్చు కోవచ్చు... ఆపదలో ఉపాయంతో గట్టెక్కడంతో పాటు.. అందరికీ ఆహారం విలువ తెలియజెప్పడం... లాంటివి ఈ కథలో నేర్చుకోవచ్చు.. 
stories for kids in telugu
 అద్భుతమైన కథ - వింత పోటీ విందు భోజనం:
ఒక అడవిలో పిట్టమ్మ కాకమ్మ పక్క పక్క ఇళ్ళలో బాగా కలసి మెలసి వుండేవి. అవసరమైనప్పుడల్లా ఒకదానికొకటి సాయం చేసుకునేవి. కాకమ్మకు ఒక అందాల కూతురుంది. దానికి పెళ్ళి చేయాలనుకొని పక్కనే వున్న అడవిలో మంచి సంబంధం వెతికింది. కూతురి పెళ్ళికి అడవిలో వున్న గడపగడపకు వెళ్ళి జంతువులను అన్నింటినీ రమ్మని పదే పదే పిలిచింది. ఏ పెళ్ళికైనా ఎంత మందికి కబురు పంపినా వచ్చేది సగం మందే గదా, రావాలనుకున్నా ఏదో ఒక పని బడో, మరిచిపోయో అదే సమయంలో ఇంకో చోటికి తప్పని సరిగా పోవలసివచ్చో అందరూ హాజరు కాలేరు.
stories for kids in telugu
దాంతో వెయ్యిమందిని పిలిచినా... వంటవాళ్ళు అయిదువందల మందికి చాలని చెప్పినా... ఎందుకైనా మంచిదని ఆరువందల మందికి వంట చేయించింది. కానీ ఆ పెళ్ళి ఆదివారం పడింది. అదివారం అందరికీ సెలవు దినం గదా... దాంతో జంతువులన్నీ ఏ పనీపాటా లేకపోవడంతో నెమ్మదిగా తయారై ఒక్కొక్కటే కాకమ్మ కూతురి పెళ్ళికి బైలుదేరాయి. పెళ్ళి మొదలయ్యేసరికి అతిథులతో మండపమంతా నిండిపోయింది. అప్పటికే దాదాపు ఒంటిగంట అవుతోంది. అందరూ మంచి ఆకలి మీద వున్నారు. అంత మందిని చూడగానే కాకమ్మ అదిరిపడింది. ఊహించని దానికన్నా ఇంకా వంద మంది ఎక్కువ వచ్చారు. వంటలు మరలా చేయిద్దామా అంటే ఏదో అన్నం పప్పు చేయించవచ్చుగానీ తినుబండారాలు అప్పటికప్పుడు కుదరదు. అదీకాక సమయం గూడా చాలా తక్కువగా వుంది. కాకమ్మకు కళ్ళలో నీళ్ళు తిరిగిగాయి. మరో అరగంటలో పెళ్ళయిపోతుంది. తాళి కట్టిన తరువాత ఎవరూ ఒక్క నిమిషం గూడా ఆగరు. ఏదో పెద్ద ఆపద తరుముకొని వచ్చినట్టు ఒక్కసారిగా ముందుకు దూకుతారు. ఇప్పుడు వాళ్ళందరికీ భోజనాలు పెట్టకపోతే పరువు పోతుంది. నలుగురిలో నవ్వులపాలవుతాం. చేతగానిదానివి అందరినీ ఎందుకు పిలిచావని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. ఎలాగబ్బా అని కిందా మీదా పడతా పిట్టమ్మని పిలిచి విషయమంతా వివరించింది. పిట్టమ్మ కాసేపు ఆలోచించి “నా దగ్గర ఒక ఉపాయం వుంది. పప్పులో పచ్చి మిరపకాయలు బాగా దంచి కలుపుదాం. కారంతో తిన్న వాళ్ళ నాలుక మంటెక్కుతుంది. దాంతో దాహం దాహం అంటూ తనకలాడతారు. సరిగ్గా ఆ సమయంలో వాళ్ళకు చల్లని కుండనీళ్ళు పోద్దాం. లోటాలకు లోటాలు గడగడగడ తాగుతారు. ఇంకేముంది దెబ్బకు పొట్ట నిండిపోతుంది. అన్నం కొంచమే తింటారు. దాంతో అందరికీ సరిపోతుంది. ఎలా వుంది నా ఉపాయం" అనింది. ఆ మాటలకు కాకమ్మ “పిలిచినాక కడుపు నిండా అన్నం పెట్టకుండా అలా చేయడం తప్పు. నా మనస్సు ఒప్పుకోవడం లేదు. ఎంత డబ్బులయినా పరవాలేదు. ఇంకా ఏదైనా ఉపాయం వుంటే చెప్పు" అనింది కాకమ్మ.
పిట్టమ్మ కాసేపు ఆలోచించి “నిజానికి నువ్వు చేయించిన ఈ విందు భోజనం పెళ్ళికి వచ్చిన అతిథులందరికీ హాయిగా సరిపోతుంది. కానీ చాలామంది పెట్టించుకునేది ఎక్కువ. తినేది తక్కువ. అనవసరంగా అన్ని పెట్టించుకొని సగం తిని సగం పారేసి వెళుతుంటారు. దీన్ని గనుక అరికట్టితే చాలు అందరికీ సరిపోతుంది" అనింది. “నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆ విషయం సూటిగా చెప్పడం ఎలా. మన గురించి అందరూ ఏమనుకుంటారు. నాకేమీ పాలు పోవడం లేదు. నువ్వే ఆలోచించు" అనింది. పిట్టమ్మ కాసేపు ఆలోచించి పెళ్ళి మండపంలోకి వచ్చింది. అందరికీ కనబడేలా పైకెక్కి అందరికీ వినబడేలా గట్టిగా ఇలా అరిచి చెప్పడం మొదలు పెట్టింది. "పెళ్ళికి వచ్చిన బంధువుల్లారా మీకందరికీ వందనం. మీ రాక మాకెంతో సంతోషం. మన కాకమ్మ గురించి తెలుసు గదా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనుకుంటుంది. అందుకే ఈరోజు పెళ్ళికొచ్చిన మీకందరికీ ఒక పోటీ పెట్టి, గెలిచిన వారికి ఒక తులం బరువున్న బంగారు ఉంగరం బహుమానంగా ఇవ్వాలని అనుకొంది" అనింది. బంగారం అంటే అందరికీ మోజే కదా... దాంతో మాటలాపేసి ఏం పోటీ పెడతారబ్బా' అని చెవులు నిక్కబొడుచుకొని వినసాగాయి.. పిట్టమ్మ గొంతు సవరించుకొని "పెళ్ళిళ్ళు, విందులు, వినోదాల సమయాల్లో చాలామంది తినే ఆహారాన్ని సగానికి సగం వృధాగా పారవేసి వెళుతుంటారు. అలా చేయడం మంచి పద్దతి కాదు. అందుకే ఈరోజు తళతళలాడే పళ్ళాల పోటీ పెడుతున్నాం. అందరూ కడుపు నిండా కావలసినవన్నీ మరీ మరీ అడిగి పెట్టిచ్చుకోండి. కానీ చివరకు వచ్చేసరికి ఏ పళ్లెంలోనూ ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. అంతా నున్నగా తినేయాలి. అలా ఎవరైతే తింటారో వాళ్ళ పేరు చీటీల మీద రాసి ఒక డబ్బాలో వేసి వుంచుతాం. చివరలో మన అడవికి రాజయిన సింహంమామ అందులోంచి ఒక చీటీ తీసి గెలిచిందెవరో చెబుతాడు. వారికి ఇప్పుడే ఇక్కడే బంగారు ఉంగరం బహుమానంగా మన అడవిలో అందరికన్నా బలమైన ఏనుగుమామతో ఇప్పించబడుతుంది. పెళ్ళికి వచ్చిన అతిథులందరూ సరదాగా ఈ పోటీకి సిద్ధం కావాలని, విజయవంతం చేయాలని సవినయంగా వేడుకుంటున్నాం" అనింది.
జంతువులన్నీ సంబరంగా అలాగేనంటూ ఒకదాన్ని చూసి మరొకటి సిద్ధం అయ్యాయి. పిల్లలు పెద్దలూ ఒక్క మెతుకు కూడా ఎక్కువ పెట్టించుకోకుండా తినసాగారు. చేసిన విందు భోజనం అందరికీ సరిపోవడమే గాక ఇంకా కొంచెం మిగిలింది. చివరలో ముందే చెప్పినట్టు చీటీలు రాసి సింహం మామతో తీయించారు. ఎవరూ ఊహించని విధంగా అడవి పందికి బహుమానం వచ్చింది.
అతిథులందరూ మా జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళు చూశాంగానీ ఇలాంటి పెళ్ళి, ఇలాంటి పోటీ ఎప్పుడూ చూడలేదు. ఇది భలే వుంది. జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. అని కాకమ్మను మెచ్చుకున్నాయి.
ఆపద నుండి తప్పించడమేగాక అందరి చేతా అభినందనలు అందుకునేలా చేసినందుకు కాకమ్మ సంబరంగా పిట్టమ్మ చేతికి మరో బంగారు ఉంగరం తొడిగింది.

Tags:

Moral Stories in Telugu,
Stories in Telugu with Moral, 
Telugu Moral Stories,
Stories for kids in telugu, 
stories for kids in telugu,
telug kathalu for kids, 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only