Thursday 10 June 2021

stories for kids in telugu - చిన్నపిల్లల నీతి కథలు తెలుగులో

✍️...నేటి చిట్టికథ stories for kids in telugu 

రామయ్య అనే రైతుకు తాను పెంచుకునే ఆవు అంటే ఎంతో ఇష్టం. దానికి సమయానికి తిండి పెడుతూ కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆవును ‘గంగమ్మా’ అని ముద్దుగా పిలుచుకునేవాడు.
అయితే ఆ ఆవు ఓ రోజు తలెత్తి ఆకాశం వైపు చూసింది. స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులను గమనించింది.

‘ఆహా! ఆ పక్షులు ఎంత హాయిగా ఎగురుకుంటూ వెళుతున్నాయో కదూ! నేను మాత్రం ఈ రామయ్య దగ్గర బందీనై బతకాల్సి వస్తోంది. నాదీ ఒక జీవితమేనా?’ అని మనసులో అనుకుంది. ఆవుకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. రామయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే సరైన సమయం అనుకుంది. నెమ్మదిగా చడీచప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పించుకుంది.
రోజూ రామయ్య తనను తీసుకువచ్చే తోటలోకి ఒంటరిగా వెళ్లింది.
అక్కడే చెట్టుపై ఉన్న దాని స్నేహితులు ఉడుత, కోతి ఆవు రాకను గమనించాయి.
‘నీ వెంట రామయ్య రాలేదా?’ అని ఉడుత ఆవును అడిగింది.
‘రామయ్య నుంచి తప్పించుకుని ఒంటరిగా వచ్చేశాను’ అని ఆవు బదులిచ్చింది.
‘రామయ్య నిన్ను చక్కగా చూసుకుంటాడని నువ్వే ఎన్నోసార్లు మాతో చెప్పావు కదా! మరెందుకు వచ్చేశావ్‌?’ ఆశ్చర్యంగా అడిగింది ఉడుత.
‘నాకు స్వేచ్ఛ కావాలి. రామయ్య దగ్గర నాకు అది దొరకడం లేదు. ఇప్పుడు నన్ను చూడండి. ఎంత ఉల్లాసంగా ఉన్నానో.. ఎంత ఉత్సాహంగా ఉన్నానో..’ అని హుషారుగా తోక ఊపుతూ, గెంతుతూ అంది ఆవు.
దాని మాటలు, చేష్టలకు ఫక్కున నవ్వింది కోతి.
‘ఎందుకు నవ్వుతున్నావ్‌? కోతి బావా!’ ఉడుక్కుంటూ గట్టిగా అడిగింది ఆవు.
అప్పుడు కోతి ఆవుతో ఇలా అంది.. ‘కోపం వద్దు.. మిత్రమా! రామయ్య నిన్ను చక్కగా కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు. పంజరంలో చిలుకను బంధించినట్లేమీ నీతో ప్రవర్తించడం లేదు. మాతో మాట్లాడుతూ నువ్వు గడపాలని రోజూ ఇక్కడకు నిన్ను విహారంగా తీసుకుని వస్తున్నాడు. కానీ మా సంగతి చూడు... ఏ పాము ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో... అల్లరి పిల్లలు ఎక్కడ తనను రాళ్లతో కొడతారోనని ఉడుత బిక్కుబిక్కుమంటూ రోజంతా గడుపుతుంది. సర్కస్‌ వాళ్లకు దొరక్కుండా ఉండాలని రోజంతా నేనూ.. భయం భయంగా బతుకుతున్నాను. వేటగాళ్లకు చిక్కకుండా ఉండాలని రోజంతా ఒత్తిడితోనే పక్షులు బతుకుతాయి. కానీ తప్పదు.. కడుపు నింపుకోవడం కోసం మేమంతా బయటకు రావాలి. ఇలా నిత్యం ఎవ్వరి కంటాపడకుండా రోజూ భయపడుతూనే ఉంటాం. మాదీ ఒక స్వేచ్ఛేనా? ఒక్క విషయం గుర్తుంచుకో. మనల్ని బంధించి బాధలు పెట్టేవాడిని వేటగాడంటారు. కంటికి రెప్పలా కాపాడే వాడిని సంరక్షకుడు అంటారు. రామయ్య వేటగాడో, సంరక్షకుడో నువ్వే ఆలోచించుకో. నిర్ణయం నీదే’ అంది కోతి. ‘చాలా బాగా చెప్పావు కోతి బావా’ అని ఉడుత దాన్ని సమర్థించింది.
ఆవుకు కూడా కోతి మాటల్లో నిజం ఉందనిపించింది.
‘క్షమించు కోతి బావా! అవధులు లేకుండా తిరగడం స్వేచ్ఛ అనుకుని ఒంటరిగా వచ్చేశాను. కానీ పరిమితి లేని స్వేచ్ఛ ప్రాణానికే ప్రమాదం అని నీ మాటల ద్వారా తెలిసింది. నాకు కనువిప్పు కలిగించావు. కృతజ్ఞతలు’ అంది.
అంతలోనే రామయ్య అక్కడకు వచ్చాడు.
‘గంగమ్మా! ఇక్కడున్నావా? ఒంటరిగా ఎక్కడికి వెళ్లిపోయావో? ఏమై పోయావో? అని కంగారుపడి పోయాననుకో! నిద్రపోవడంతో నిన్ను ఇక్కడకు తీసుకురాలేకపోయాను. ఇంకెప్పుడూ ఇలా ఆలస్యం చేయను. నాకు నువ్వు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు ఆవుకేసి ఆప్యాయంగా చూస్తూ. కొంతసేపటికి దాంతో కలిసి ఇంటి బాటపట్టాడు రామయ్య.
ఉడుత, కోతి.. ఆవుకు ఆనందంగా వీడ్కోలు పలికాయి.
ఇంకెప్పుడూ అది పారిపోయే ప్రయత్నం చేయలేదు.

Tags:
stories for kids in telugu,
stories in telugu for kids,
stories in telugu with moral,
moral stories telugu,
telugu stories with moral,
telugu stories for children,
telugu children stories,
children's story in telugu,
చిన్నపిల్లల నీతి కథలు తెలుగులో

Post a Comment

Whatsapp Button works on Mobile Device only